కొన్ని పేర్లు వింటే రక్తం మరుగుతుంది.. కొన్ని అడుగులు చూస్తే వ్యవస్థలు ఉలిక్కిపడతాయి. తెలుగు గడ్డపై అలాంటి ఒక సంచలనం పేరు 'పవన్ కళ్యాణ్'. ఒకప్పుడు ఆయన సినిమా వస్తుందంటే థియేటర్ల దగ్గర జాతర.. ఇప్పుడు ఆయన అసెంబ్లీలో అడుగుపెడితే అదొక పవర్‌ఫుల్ తుఫాను. రాజకీయాల్లోకి వెళ్లి సినిమాలు తగ్గించినా ఆయన క్రేజ్ తగ్గలేదు, నిరంతర ప్రజాపోరాటంలో ఆయన వేగం ఆగలేదు. నేడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా, లక్షలాది మందికి ఆశాజ్యోతిగా 55వ వసంతంలోకి అడుగుపెడుతున్న ఈ 'అజేయ శక్తి' ప్రయాణం చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం.
పవనిజం: ఒక లైఫ్ స్టైల్.. ఒక ఎమోషన్!
సినిమా ఇండస్ట్రీలో హిట్టు కొడితేనే స్టార్ డమ్ వస్తుంది. కానీ ప్లాపుల్లో కూడా ఫాలోయింగ్ పెంచుకున్న ఏకైక హీరో బహుశా పవన్ కళ్యాణ్ మాత్రమే. ఆయనకు ఆడియన్స్ లేరు, భక్తులు మాత్రమే ఉన్నారు. డ్రెస్సింగ్ స్టైల్ అయినా, డైలాగ్ డెలివరీ అయినా ఎవరినీ అనుకరించకుండా తనకంటూ ఒక సెపరేట్ ట్రెండ్ క్రియేట్ చేశారు. సమాజం పట్ల ఆయనకున్న బాధ్యత, వ్యక్తిత్వంలోని నిజాయితీ 'పవనిజం' అనే ఒక కొత్త సిద్ధాంతానికి ఊపిరి పోశాయి. అందుకే ఆయన తెరపై కనిపిస్తే కేవలం ఈలలు, గోలలు మాత్రమే కాదు.. ఒక తెలియని పూనకం వస్తుంది.
ఓటమి నేర్పిన పాఠం.. గెలుపుకి వేసిన బాట!
"నాకు పదవులు ముఖ్యం కాదు, మార్పు ముఖ్యం" అని జనసేన పార్టీని స్థాపించినప్పుడు చాలామంది నవ్వారు. ఎన్నో రాజకీయ దాడులు, ఘోరమైన పరాజయాలు, వ్యక్తిగత విమర్శలు ఆయన్ని చుట్టుముట్టాయి. కానీ ఆయనొక బండరాయిలా నిలబడ్డారు. ఆశయాన్ని నమ్ముకున్న ఆ ఒంటరి సైనికుడు.. తన సహనంతో, పట్టుదలతో 2024 ఎన్నికల్లో అద్భుత విజయాన్ని సాధించి ఓటమిని శాసించాడు. నేడు గ్రామీణాభివృద్ధి, పంచాయితీరాజ్ లాంటి కీలక శాఖల మంత్రిగా అట్టడుగు వర్గాలకు అండగా నిలుస్తున్నారు.
జనం గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే మన పవర్ స్టార్ కు, జనసేనానికి 55వ జన్మదిన శుభాకాంక్షలు!
